కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి
- By : Anirban Ganguly
- Category : In News

జగిత్యాల జిల్లా: మోడీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్భన్ గంగూలీ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన… శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. మోడీ తన మంత్రి వర్గంలో చాలా మంది మహిళలకు స్థానం కల్పించారన్నారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళను పోటీలో నిలపడం ద్వారా మహళల పట్ల తనకున్న గౌరవాన్ని మోడీ మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు. ఈ విషయాలన్నింటినీ మహిళా మోర్చా నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆమెను తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తున్నారని తెలిపారు.
కార్వాన్ లో…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ కార్వాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు బాగా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.